విజయ్ తో పాటు 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే... ఆ తర్వాత ఏం జరుగుతుంది?

  • భారీ మెజార్టీ సాధించినా విజయ్ ను ఆహ్వానించని గవర్నర్
  • విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు ఒక్కటవుతున్న డీఎంకే, అన్నాడీఎంకే
  • అదే జరిగితే 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామన్న విజయ్
  • మళ్లీ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హెచ్చరిక
  • అదే జరిగితే తమిళనాడులో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే (TVK) అధినేత విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు (108 స్థానాలు. రెండు స్థానాల్లో విజయ్ గెలుపు) సాధించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటు విజయ్ కు అందని ద్రాక్షగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. 118 మంది ఎమ్మెల్యేల జాబితాను సమర్పిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిస్తానని గవర్నర్ చెప్పడం ఆ పార్టీకి, తమిళనాడులోని కోట్లాది మంది ఓటర్లకు శరాఘాతమే. 


ఇదే అదనుగా, తమిళనాడులో దశాబ్దాల రాజకీయ వైరం ఉన్న ఓల్డ్ గ్రాండ్ ద్రవిడియన్ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే అధికారం కోసం చేతులు కలిపేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. అధికారం కంటే కూడా... రాష్ట్రంలో మూడో రాజకీయ శక్తిగా విజయ్ పార్టీ ఎదగకుండా నిలువరించడమే ఈ పార్టీల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చను లేవనెత్తింది. 


తమను కాదని డీఎంకే లేదా అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తే తమ పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని టీవీకే హెచ్చరించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. భారత రాజ్యాంగంలోని అధికరణ 190 ప్రకారం, ఒక ఎమ్మెల్యే తన రాజీనామా లేఖను నేరుగా స్పీకర్‌కు సమర్పించాలి. అయితే, ఈ రాజీనామాలు స్వచ్ఛందంగా ఇచ్చారా? లేక ఏదైనా ఒత్తిడితో ఇచ్చారా? అనేది స్పీకర్ క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. 107 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాజీనామా చేయడం అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలో అసాధారణమైన విషయం.


ఒకవేళ స్పీకర్ ఈ రాజీనామాలను ఆమోదిస్తే, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఆ 107 నియోజకవర్గాలకు ఆరు నెలల లోపు ఉపఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అవుతుంది. అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాల్లో సగానికి దగ్గరగా ఉన్న ఈ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరపడం అంటే అది దాదాపుగా ఒక మినీ అసెంబ్లీ ఎన్నికతో సమానం. ఎన్నికల కమిషన్‌కు ఇది ఒక భారీ సవాలుగా మారుతుంది. అప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి లేకపోతే, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందనే కారణంతో గవర్నర్ ఆర్టికల్ 356 కింద రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అధికారం మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇదే జరిగితే తమిళనాడు వంటి రాష్ట్రంలో రాజకీయ సెగలు పుట్టడం ఖాయం.


విజయ్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య జరుగుతున్న తెరవెనుక చర్చలేనని తెలుస్తోంది. టీవీకే 108 స్థానాలు సాధించగా (విజయ్ రెండు చోట్ల గెలవడంతో ఒక సీటు ఖాళీ అవుతుంది, ఫలితంగా బలం 107 అవుతుంది), కాంగ్రెస్‌తో కలిపి వారి బలం 112కి చేరుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం 6 సీట్లు మాత్రమే తక్కువగా ఉన్న తరుణంలో.. ఇటు డీఎంకే, అటు అన్నాడీఎంకేలు కలిసి ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం ప్రయత్నిస్తున్నారనే వార్తలు టీవీకే క్యాంపులో ఆగ్రహాన్ని నింపాయి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా తమను అడ్డుకుంటే, మళ్లీ ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకోవడానికి సిద్ధమని విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.


ఒకవేళ ఈ మూకుమ్మడి రాజీనామాలు గనుక జరిగితే, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఇది మునుపెన్నడూ లేని ఒక విభిన్నమైన ఘట్టం అవుతుంది. గవర్నర్ తీసుకునే నిర్ణయం, ఎన్నికల కమిషన్ నిర్వహించే ఉపఎన్నికలు, ప్రజల నాడి.. ఇవన్నీ కలిసి తమిళనాడు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అంటే ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల తీర్పుపై ఇది రెండోసారి ప్రజల అభిప్రాయాన్ని కోరడమే అవుతుంది.


Vijay TVK
Tamil Nadu politics
TVK party
DMK ADMK alliance
Tamil Nadu assembly elections
mass resignations
article 356
president rule
Tamil Nadu political crisis
Tamil Nadu by elections

More Telugu News